తెలంగాణ ఇక ఒక్క క్షణం కూడా నిన్ను భరించలేదు కేసీఆర్…రేవంత్ రెడ్డి

తెలంగాణ ఇక ఒక్క క్షణం కూడా నిన్ను భరించలేదు కేసీఆర్…రేవంత్ రెడ్డి

Banner Ad

కేబినెట్ సమావేశ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పత్రికా సమావేశంలో ఏకపాత్రాభియనం చూశాను. ఆయన మాటల్లో అడుగడుగునా అహంకారం, అధికార మదం కొట్టొచ్చినట్టు కనిపించాయి. 16 మంది కార్మికులు చనిపోతే కనీస మానవత్వం లేకుండా కేసీఆర్ మాట్లాడారు. సదరు కార్మిక కుటుంబాలను ఆదుకుంటామని కానీ, కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ధైర్యం చెప్పే ప్రయత్నం కానీ, సమస్యను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కానీ ఆయన మాటల్లో కనిపించలేదు. నేనింతే… నేను నియంతను, నా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు చేస్తాను బతికితే బతకండి… చస్తే చావండి అన్నట్టుగా కేసీఆర్ తీరు కనిపించింది. రాచరికం రోజుల్లో కూడా ఇంతటి నియంతను ప్రజలు చూసి ఉండరు. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ మొత్తం విన్న తర్వాత నాకు ఒక్క విషయం స్పష్టంగా అర్థమైంది. ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు. దాని కోసం ఎన్ని ప్రాణాలనైనా బలిపెట్టడానికి సిద్ధపడ్డారు. కోర్టుల పై కేసీఆర్ కు కనీస గౌరవం లేదు. కోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకునే ఉద్దేశం కనిపించ లేదు. కార్మికులు అంటే అంటరాని వారు అన్నట్టుగా ఆయన తీరు కనిపించింది. సంఘం ఆయన పార్టీకి అనుబంధంగా ఉన్నప్పుడు , దానికి ఆయన అల్లుడు హరీష్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మంచివాళ్లుగా కనిపించిన కార్మిక సంఘం, నాయకులు ఇప్పుడు చెడ్డవాళ్లుగా కనిపించడంలో ఆంతర్యం ఏమిటి? కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించడమే వాళ్లు మీకు చెడ్డవాళ్లుగా కనిపించడానికి కారణం కాదా!?  సమస్యలు ఉన్నప్పుడు పిలిచి మాట్లాడి, పరిష్కారం కనుగొనడం ప్రజాస్వామ్యంలో సహజ ప్రక్రియ. కానీ, కేసీఆర్ మాత్రం నియంతలా నా నిర్ణయమై ఫైనల్ అంటున్నారు. ప్రజా సంఘాలు, బుద్ధి జీవులు, కోర్టులు చేసిన సూచనలు పెడచెవిన పెడుతున్నారు. కనీసం కార్మికులు పిట్టల్లా రాలిపోతుంటే కనికరం చూపలేని రాతి హృదయం కలిగిన వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టం.

కొందరు బడాబాబులకు ఆర్టీసీని అమ్మివేయడానికి ఆయన ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. నెపాన్ని ప్రతిపక్షాలు, కార్మిక సంఘాల పై నెట్టి చేతికి మట్టి అంటకుండా ఆర్టీసీని హత్య చేసేందుకు పన్నాగం పన్నారు. అందుకే ఎవరెన్ని సూచనలు చేసినా ఆయన చెవికి అక్కడం లేదు. ఉద్యమ సమయంలో బంగారు ముద్దలుగా కనిపించిన కార్మికు సంఘాలు ఇప్పుడు అంటరానివిగా, ప్రగతి నిరోధకాలుగా కేసీఆర్ కు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రక్రియలో ప్రధాన అడ్డంకి కార్మిక సంఘాలే. అందుకే వాటిని అంతమొందించేందుకు సంఘాల పై ప్రజల్లో విషం నూరిపోసే ప్రయత్నం చేస్తున్నారు. తాను అనుకున్న తంతు పూర్తి చేసేందుకు కోర్టులకు సైతం అధికారుల చేత తప్పుడు నివేదికలు ఇప్పించిన ఘనుడు కేసీఆర్. సమ్మె మొదలై నెల రోజులు కావస్తున్నా… ప్రజలు అష్టకష్టాలు పడుతున్నా కేసీఆర్ కు మాత్రం చీమకుట్టినట్టైనా లేదు.

ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడే కేసీఆర్ పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అక్కడి ప్రభుత్వం పట్టుదలగా ఉంది. అదే పని తెలంగాణలో చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? కోర్టులు ఏం చేయగలవన్నట్టు కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇలాగే అడ్డగోలుగా, అనుయాయులకు ఆస్తులు దోచిపెట్టి, అవినీతికి పాల్పడిన చాలా మంది ముఖ్యమంత్రులు జైళ్లలో ఊచలు లెక్కబెట్టిన ఉదంతాలు ఉన్నాయి. కేసీఆర్ కు కూడా ఆ గతి పట్టడం ఖాయం.

ఓ వైపు కార్మికులు రెండు నెలలుగా పస్తులు ఉంటే మానవత్వంలో వారి స్థితిని అర్థం చేసుకోవాల్సింది పోయి… చిరు కార్మికుల పై బ్లాక్ మెయిల్ అస్త్రం ప్రయోగిస్తున్నారు. ఐదవ తేదీ లోపు విధుల్లో చేరకుంటే డిస్మిస్ అంటూ హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ లాంటి అహంకారాన్ని తెలంగాణ సమాజం ఎక్కువ కాలం భరించలేదు. ఇప్పటికే హద్దుదాటి కేసీఆర్ దుర్మార్గాన్ని సమాజం భరించింది. ఇక ఒక్క క్షణం కూడా ఈ దురహంకారిని భరించే స్థితిలో ప్రజలు లేరు. తెలంగాణలో కేసీఆర్ పోకడలకు వ్యతిరేకంగా మరో ఉద్యమం తీవ్ర రూపంలో మొదలు కావాల్సిన తరుణం ఆసన్నమైంది.

ఎ. రేవంత్ రెడ్డి,

ఎంపీ-మల్కాజ్ గిరి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *