ఆసియా ఖండంలోనే అరుదైన జలాశయంగా పేరొందిన సరళ సాగర్ ప్రాజెక్టుకు గండి పడటంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశిష్టతను కల్గి ఉన్న ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలని ఇంజినీర్లు నివేదిక ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. రైతులకు సిరులను పండిస్తున్న ఈ రిజర్వాయర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వహించిన నిర్లక్ష్యం మూలంగానే సరళ సాగర్ ప్రాజెక్టుకు భారీ గండి పడిందని చెప్పుకొచ్చారు.ఈ ప్రాజెక్టు దిగువ ప్రాంత రైతులు వరి నాట్లు వేసుకొని పంట చేతికొస్తుందని గంపెడు ఆశలు పెట్టుకుంటే.. సరళ సాగర్ జలాశయంపై ప్రభుత్వ భాధ్యతలేమి ఆ ప్రాంత రైతులకు శాపంగా మారిందని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం రైతు విద్రోహ చర్యలకు పాల్పడుతుందన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు ఈ ఘటనపై ఎం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రిని ఇద్దరు మంత్రులు నిలదీయాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ పై సీఎం కెసిఆర్ సవతి తల్లి ప్రేమను చూపిస్తారని చెప్పేందుకు ఈ ఘటననే నిదర్శనమని చెప్పారు. కల్వకుర్తి, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు నత్తనడకన నడుస్తుంటే ఇద్దరు మంత్రులు ఎం చేస్తున్నారని… గుడ్డి గుర్రం పళ్ళు తోముతున్నారా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. జిల్లా ప్రజల చేత అసమర్ధ మంత్రులుగా ముద్ర వేయించుకోవద్దని ఇందిరాశోభన్ సూచించారు.
Congress Leader Indira Shoban meets Governor
